Telugu News » Telangana : ఎవరు ఎవరితో దోస్తీ..!

Telangana : ఎవరు ఎవరితో దోస్తీ..!

కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి ఎందుకు మాట్లాడరని ఫైరవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు కేసీఆర్ కలిశారన్న మోడీ.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు.

by admin
all parties exercise for candidates

– కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనంటున్న మోడీ
– కాదు, బీజేపీ-బీఆర్ఎస్ కలిశాయంటున్న రాహుల్
– అంతలేదు, కాంగ్రెస్, బీజేపీ దోస్తీ అంటున్న గులాబీలు
– ఎవరి మాట నిజం?
– ఎన్నికల వేళ పార్టీల వ్యూహాత్మక అడుగులు
– అధికారమే లక్ష్యంగా విమర్శల దాడులు

తెలంగాణ (Telangana) లో ఈసారి ఎన్నికల్ని ప్రధాన పార్టీలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మూడు పార్టీల నేతలు పవర్ ఫుల్ స్పీచులు, పంచ్ డైలాగులు విసురుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరితో ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. వాటిలో ప్రధానంగా వినిపిస్తున్న మాట చీకటి ఒప్పందం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననేది కాంగ్రెస్ వాదన. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేననేది బీజేపీ ఆరోపణ. లేదు, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననేది బీఆర్ఎస్ వాదన. ఎవరి వెర్షన్ వారిదే.

all parties exercise for candidates

ప్రధాని మోడీ (PM Modi) వరుస తెలంగాణ పర్యటనలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. పైగా, మునుపెన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ సర్కార్ పై ఆయన విరుచుకుపడ్డారు. కొత్త విషయాలను చెప్పి.. మీడియాకు కావాల్సినంత స్టఫ్ అందించారు. ఇప్పటి వరకూ కుటుంబ పార్టీ, అవినీతి పాలన అంటూ బీఆర్ఎస్‌ పై విమర్శలు చేసిన ప్రధాని.. నిజామాబాద్ టూర్ లో కేసీఆర్‌ (KCR) ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ వేసిన ప్లాన్ ను సభా ముఖంగా బయటపెట్టారు. ఎన్డీఏలో కలిసేందుకు జరిగిన ప్రయత్నాల్ని వివరించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. కర్ణాటక ఎన్నికల్లో కూడబలుక్కొని కుట్ర చేశాయని విమర్శించారు. దీంతో మోడీ వ్యాఖ్యల చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో ఈసారి పాగా వేయాలని కాంగ్రెస్ చూస్తోంది. మరి, ఇలాంటి సమయంలో మోడీ వ్యాఖ్యలు ఆపార్టీకి డ్యామేజ్ ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీదే రహస్య ఒప్పందమంటూ విమర్శల దాడి చేశారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అంటూ ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కలిసి గత పదేళ్లుగా తెలంగాణను నాశనం చేశాయని మండిపడ్డారు. ప్రజలు తెలివైన వారు.. ఈ ఆటను అర్థం చేసుకున్నారు.. ఈసారి ఆ రెండు పార్టీలను తిరస్కరించి ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని జోస్యం చెప్పారు రాహుల్ గాంధీ.

కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందిస్తూ.. కౌంటర్ ట్వీట్ చేశారు. రాహుల్.. ఇది మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం అంటూ ఎద్దేవ చేశారు. ప్రధాని మోడీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ ల బంధాన్ని స్పష్టంగా బయటపెట్టారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల వేళ తెర వెనుక చేసుకున్న మీ రహస్య ఒప్పందం బట్టబయలైందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కు బ్యాక్ డోర్ ఎంట్రీని ఎలా సులభతరం చేసిందో ఇప్పుడు అందరికీ తెలుసని వెల్లడించారు. తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా ఆక్రమణలకు గురవుతున్న హిందూ దేవాలయాలపై ముందు మీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని సవాల్ చేశారు బండి సంజయ్.

ఇక బీఆర్ఎస్ నేతలు కూడా తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు. నిజామాబాద్‌ టూర్‌ లో కేసీఆర్, కేటీఆర్‌ (KTR) పై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి ఎందుకు మాట్లాడరని ఫైరవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు కేసీఆర్ కలిశారన్న మోడీ.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అయినా వీళ్ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఓట్లు రాబట్టుకునే పనిలో పడ్డాయి.

You may also like

Leave a Comment