అధికారం కోల్పోయి బీఆర్ఎస్.. పట్టుసాధించాలని చూస్తున్న బీజేపీ (BJP).. ఈ రెండు పార్టీల నేతల మధ్య వార్ పీక్స్‌కు చేరింది. పలు సమస్యలతో సతమతం అవుతున్న గులాబి నేతలు.. తమ ఉనికి కాపాడు కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో విమర్శలను ప్రధాన అస్త్రాలుగా ఎంచుకొన్నారని తెలుస్తోంది. అందులో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ (Medak)లో పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది.
చివరికి బీజేపీ, బీఆర్ఎస్ (BRS) నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొనే వరకి వెళ్ళింది. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao), బీఆర్ఎస్ నేతలపై అసభ్య పదజాలం వాడారని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రఘునందన్ పై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారని బీజేపీ సైతం ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుతో వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy)తో పాటు మాజీ సుడా చైర్మన్ రవీందర్‌పై సిద్ధిపేట త్రీటౌన్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. అలాగే కాంగ్రెస్ సైతం మతం పేరుతో రెచ్చగొడుతున్నారని రఘునందన్ రావు పై ఫిర్యాదు చేసింది. ఈయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కోరింది. అదేవిధంగా ఆయన అనుచరులు రఘునందన్ రావు, మోడీ బొమ్మలున్న క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది.