అధికార బీఆర్ఎస్ (BRS) పార్టీలో వర్గ విభేదాలు కాకా రేపుతున్నాయి. అలంపూర్ (Alampur) బీఆర్ఎస్‌లో అసమ్మతి చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అబ్రహాంకే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని అధికార బీఆర్ఎస్ పార్టీలోని కొందరు బలంగా వ్యతిరేకించారు. అలంపూర్ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే అబ్రహాం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గాల చీలిక కేడర్‌లో గందరగోళం సృష్టించింది.
బీ ఫామ్ చేతికొచ్చే సమయంలో అసమ్మతి తెరపైకి రావడం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం (Abraham) రాజకీయ జీవితం అయోమయంలో పడింది. అప్పటి నుంచి అసంతృప్తితో రగులుతున్న అబ్రహాం కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కి భారీ షాక్ ఇవ్వడానికి అబ్రహాం సిద్దం అయినట్టు వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం ఊపందుకుంది.
ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ (Congress) పార్టీతోనే ఏదైనా సాధ్యమని భావించి, అలంపూర్ ప్రాంత అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్టు అబ్రహం తెలుపుచున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన తనకు టికెట్ ఇవ్వకపోవడం బాదేసిందన్న అబ్రహం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు టిక్కెట్టు ఇచ్చినట్టే ఇచ్చి ఉద్దేశపూర్వకంగా తనను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే అబ్రహం వెంట కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఇక అబ్రహం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే అలంపూర్‌లో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ విజయం ఖాయం అంటూన్న అబ్రహం అనుచరులు.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా కనిపిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు..