పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారతాయి అనుకున్నాం.. కానీ, 10ఏళ్లు గడిచినా ఎక్కడున్న గొంగడి అక్కడే ఉందని మంత్రి(Minister) పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ(బుధవారం) ఏర్పాట్లు చేసిన విలేకర్ల సమావేశంలో ఉద్వేగపూర్వకంగా మాట్లాడారు.
నిరుద్యోగులతో పాటు సకల జనుల బతుకులు మరలేదని, రాష్ట్ర ప్రజలు మార్పు కావాలన్నారని కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 31 రోజుల్లోనే హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలనే సంకల్పంతో వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబానికి తప్ప ఏ కుటుంబానికీ న్యాయం జరగలేదన్నారు.
అదేవిధంగా ఏ మంత్రికీ స్వేచ్ఛ లభించలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మనసుంటే మార్గముంటుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందిస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.
ఆరు నూరైనా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. తాము నాయకులం కాదని.. ప్రజా సేవకులమని, రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారని చెబుతూ మంత్రి పొంగులేటి కన్నీటి పర్యంతమయ్యారు. పుట్టుకతో ఏ ఒక్కరూ కోటీశ్వరుడు కాదని మనో వేదనకు గురయ్యారు.
తాను కన్నీరు పెడితే కార్యకర్తలు నిరాశ పడతారని కన్నీరు చెమ్మగిళ్ళనివ్వలేదన్నారు. ఇక్కడున్న ఇదే అధికారులు ఎంతో ఇబ్బంది పడుతూ కేసులు పెట్టారని గుర్తుచేశారు. ‘నన్ను పెట్టిన బాధలకు.. నా కృషికి, పట్టుదలకు ఈ ఫలితం దక్కింది.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తాం’ అంటూ మంత్రి తన సమావేశాన్ని ముగించారు.