కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు ఆపార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy). కాంగ్రెస్ కు దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాత్కాలికంగా ఇబ్బందులు తప్పవన్న ఆయన.. అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. కాళేశ్వరం (Kaleswaram) రోల్ మోడల్ అని కేసీఆర్ (KCR) పదే పదే చెప్పారని.. ప్రపంచంలో ఇదే గొప్ప ప్రాజెక్ట్ అన్నారని.. చివరకు ఏం జరిగిందో చూస్తున్నామని అన్నారు.
కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు ఏదో ఒక రోజు కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు పొంగులేటి. మేడిగడ్డపై దర్యాప్తు సంస్థలే నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ గూటి పక్షులన్నీ ఒకచోటకు వస్తున్నాయని.. పెను తుపానులా పార్టీ విజృంభిస్తుందన్నారు. ఆత్మ గౌరవం కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. హస్తం నేతల మీద ఫోకస్ చేసి ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పలితాలను ఊహించి ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజీపీ లు కలసి ఈ దాడులు చేయిస్తున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా బీజేపీకి నష్టం లేదన్న పొంగులేటి.. కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు అనేదే బీజేపీ వైఖరి అని విమర్శించారు. త్వరలోనే తనపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా సంపాదించిన లక్షలాది కోట్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుతో మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.