తెలంగాణ (Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ (Congress) కు షాక్ తగిలింది. పార్టీ వీడుతున్నట్టు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ప్రకటనతో కాంగ్రెస్ లో అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మరోవైపు మంత్రి పొన్నాల పై రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ఘాటు వాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపధ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు.
మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం.. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. తన రాజీనామాపై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గు ఉండేవారు మాట్లాడేవేనా అని సీరియస్ అయ్యారు. ఐకమత్యమే పార్టీ బలమన్న విషయాన్ని మరచిన రేవంత్ రెడ్డి.. తనను అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయారని అనడం హాస్యాస్పదం అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా గెలవని రేవంత్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. తన పార్లమెంట్ మల్కాజిగిరి పరిధిలో ఎన్ని సీట్లు గెలిచారని ప్రశ్నించారు. . కొడంగల్‌లో కూడా ఓడిపోయిన రేవంత్ రెడ్డి నా గెలుపు గురించి మాట్లాడటం విడ్డూరమని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు రావాలని కోరినట్టు పొన్నాల తెలిపారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు. కాగా కాంగ్రెస్ వీడిన తర్వాత పొన్నాల, రేవంత్ రెడ్డి పై ఫైర్ అవడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది.