రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తి పోసుకొన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఇప్పటికీ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. హస్తం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. గులాబీ తోటలోని కొందరు నేతలు గప్ చుప్ అయినా.. మరికొందరు మాత్రం విమర్శలను వదిలిపెట్టడం లేదని అనుకొంటున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కీలకమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)..కేటీఆర్ (KTR)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ జ్ఞానం లేని కేటీఆర్.. వారి ప్రభుత్వ హాయంలో చేసిన తప్పులని మరచి.. అప్పుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.. చేసిన అభివృద్ధిపై క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం.. మీ హయాంలో ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధమా? అంటే ఉలుకుపలుకు ఉండదని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు..
కనీసం మీ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసైన అవగాహన తెచ్చుకోవాలని కేటీఆర్ కి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వారం రోజులకే పదేళ్లు పాలన చేసిన ఆయన హామీల గురించి మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతున్నాయని, వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని పొన్నం తెలిపారు..
కడియం చేసిన వ్యాఖ్యల వెనక మీ హస్తం ఉందా? అని ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు మానుకోవాలని హితవు పలికారు.. ప్రజలు మార్పు కోరుకున్నారు. కాబట్టి ప్రజా తీర్పును గౌరవించకుండా.. అధికారం లేకుంటే బ్రతకలేమన్నట్టు ప్రవర్తించడం రాష్ట్రానికి మంచిది కాదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు..