రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు.. బంద్ అవుతోందని బీఆర్ఎస్ (BRS) నేతలు ఎన్నికల సమయంలో తెగ ప్రచారం చేశారు.. తీరా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ, రైతు బంధుకి అడ్డు తగులుతోందని, రైతులని నమ్మించే ప్రయత్నాలు చేశారు.. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు..
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారిగా పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) గజ్వేల్ (Gajwel)కు వచ్చారు. ఆయనకి డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతు బంధు పై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని తెలిపారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని, తాము కూడా అలాగే ఇస్తామని వెల్లడించారు.
గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ (KCR) ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలిశారా? అని ప్రశ్నించారు. ప్రజాభవన్‌గా.. ప్రగతిభవనాన్ని మార్చి ప్రజలకి అందుబాటులోకి తెచ్చామని పొన్నం పేర్కొన్నారు.. ప్రజల సమస్యలను అక్కడ తెలుసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ హమీ ఇచ్చారు.
రైతుబంధులో చాలా లోపాలు ఉన్నాయని వెల్లడించిన పొన్నం ప్రభాకర్.. వాటిని సవరించి వీలైనంత త్వరలో రైతు బంధు నగదు అందిస్తామని రైతులకి తెలిపారు.. రైతు బంధు విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని వివరించారు.. గత ప్రభుత్వ అనుభవాలు ప్రజలకు నేర్పించిన పాఠాలని తెలిపిన పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని వెల్లడించారు.. ప్రజా శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పాటుబడుతోందని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ న్యాయం అందేలా కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు..