ఎన్నికలు(Telangana elections) సమీపిస్తుండడంతో అధికార బీఆర్ఎస్(Brs) వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష నాయకులు ఏ ఒక్క ఛాన్స్‌ను వదలడం లేదు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో నేతలు పర్యటించి ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్(Medigadda laxmi barriage) మూడు పిల్లర్లు ఇటీవల కుంగిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం అక్కడ 144 సెక్షన్‌ను అమలు చేసింది. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సందర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చలో కాళేశ్వరానికి పిలుపునిస్తూ హుస్నాబాద్ నుంచి మూడు బస్సులో పార్టీ కార్యకర్తలు, రైతులను తీసుకుని వెళ్తుండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం బొమ్మపూర్‌లోని మందరగిరి వేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురికి మాత్రమే ప్రాజెక్టు సందర్శనకు అవకాశం ఉంటుందని పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. మిగతా వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా రోడ్డుపై బైటాయించిన ఆందోళన చేస్తున్నారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మంచి జరిగితే ముఖ్యమంత్రికి, చెడు జరిగితే అధికారులపై నెట్టేసే పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాలున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులు, మేధావులతో ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలియాలన్నారు.