వివాదాలతో ఫేమ్‌ను సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam Pandey) చనిపోయినట్లు ఆమె టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం పూనమ్ తిరిగి తాను బతికే ఉన్నానని, కేవలం సర్వైకల్ క్యాన్సర్(Cervical cancer)పై అవగాహన కల్పించడానికే అలా పోస్ట్ చేయించానని క్లారిటీ ఇచ్చింది.
అయితే, పూనమ్ చేసిన పనికి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్ పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘పూనమ్ పాండే మరణంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు బాధ్యులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి.. ఇలాంటి నకిలీ వార్తలను అరికట్టాలి’’ అని సదరు జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పూనమ్ పాండే ఫేక్ న్యూస్‌పై పలువురు సెలెబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఆ వార్త నిజమే అనుకొని చాలా మంది సోషల్ మీడియాలో సంతాపాన్ని తెలిపారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పలువురు నివాళులర్పించారు. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అని తెలియగానే అందరూ ముక్కున వేలేసుకున్నారు.
గర్భాశయ ముఖద్వారం ద్వారా కలిగే క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశం మంచిదే అయినా.. పూనమ్ పాండే ఎంచుకున్న మార్గం మాత్రం సరిగా లేదని పలువురు అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్ పాండేని 13లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇంతకు ముందు కూడా ఆమె అనేక వివాదాలు సృష్టించింది.