ఓ వ్యక్తి తపాలాశాఖ(Postal Department)లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 28ఏళ్ల తర్వాత(Ofter 28 years) జాబ్(job) వచ్చింది. దరఖాస్తు చేసుకున్న సమయంలో అనర్హుడని అభ్యర్థుల జాబితా నుంచి తొలగించిన తపాలా శాఖ ఎట్టకేలకు సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలతో 28ఏళ్ల తర్వాత ఆ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన నియామక ఉత్తర్వులను అతడికి పంపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్ చెందిన అంకుర్ గుప్తా 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ముందస్తు శిక్షణకూ ఎంపికయ్యాడు. అయితే, అతడు వృత్తివిద్యా కోర్సులో ఇంటర్మీడియట్ చదివినందున ఉద్యోగానికి అనర్హుడంటూ ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి అంకుర్ గుప్తా పేరును తపాలా శాఖ తొలగించింది.
దీంతో అంకుర్‌గుప్తా కోర్టును ఆశ్రయించాడు. దీంతో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగానికి ఎంపికై ముందస్తు శిక్షణ ఉత్తర్వులు కూడా అందుకున్న తర్వాత సరైన విద్యార్హతలు లేవంటూ నియామకాన్ని రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆ అభ్యర్థికి నెల రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని, ఒకవేళ పోస్టు ఖాళీ లేకపోతే అదనంగా సృష్టించి అయినా ఇవ్వాల్సిందేనని తపాలా శాఖను ఆదేశించింది. దీంతో 28ఏళ్ల తర్వాత అంకుర్‌గుప్తా అనే వ్యక్తికి ఉద్యోగం లభించినట్లైంది.
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ను గుప్తా ఆశ్రయించగా అతనికి అనుకూలమైన తీర్పు వెలువడింది. దీనిని సవాల్ చేస్తూ తొలుత హైకోర్టులో, అక్కడా ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టులోనూ తపాలా శాఖ పిటిషన్ వేసింది. కేసును విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పోస్టల్ శాఖ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అంకుర్ గుప్తాకు నెల రోజుల్లో ఉద్యోగం ఇవ్వాల్సిందేనని ఇటీవల ఆదేశించింది.