ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్(AP)లో రాజకీయం రసవత్తరంగా మారింది. సీటు కోసం ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి బరిలోకి దిగుతుండటంతో మూడు పార్టీల నుంచి అభ్యర్థులు సీటు కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా(NTR District) విజయవాడ పశ్చిమ నియోజకవర్గం(Vijayawada West Constituency) సీటు తనకే కేటాయించాలంటూ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద నమ్మకం ఉందనీ.. రెండో లిస్టులో తన పేరు ఉంటుందని పోతిన మహేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన చెప్పడం వల్లే తాను దూకుడు పెంచానని వివరించారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ అదే కోరుకుంటున్నారని చెప్పారు. తనకు సీటు ఇవ్వడమే న్యాయమని అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ తనకు తెలుసని, జనసేన పార్టీ తనకు తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరే నియోజకవర్గానికి పంపించిదని, తమ పోరాట ఫలితం కాదా? అని ప్రశ్నించారు.
పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అనీ కూటమిలో భాగంగా తనకు సీటు కేటాయించడమే న్యాయమని పోతిన మహేష్ అన్నారు. ఐదేళ్ల నుంచి కష్టపడి పనిచేశానని చెప్పుకొచ్చారు. తనతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు సైతం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల అభివృద్ధికి జనసేన పాటుపడిందని వెల్లడించారు.