తెలంగాణ(Telangana) వ్యాప్తంగా గురువారం అభయహస్తం దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన.. అభయ హస్తం దరఖాస్తు ఫారం విషయంలో కొందరు దళారులు సరికొత్త దందాకు తెరలేపారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కో దరఖాస్తు ఫారాన్ని రూ.50 నుంచి 100కు విక్రయిస్తున్నారు. ప్రతీ కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో పేదలు తప్పదని పరిస్థితుల్లో దరఖాస్తు ఫారానికి డబ్బులు వెచ్చిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.
అయితే, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న దరఖాస్తు ఫారంతో కొందరు వ్యక్తులు దందా మొదలుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.