ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫౌండర్ లలిత్ మోడీ(Lalit Modi)పై టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్(Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కాంట్రాక్టుపై సంతకం చేయకుంటే తన కెరీర్‌ను నాశనం చేస్తానని లలిత్ మోడీ బెదిరించాడని తెలిపాడు.
37ఏళ్ల ప్రవీణ్ కుమార్ ఐపీఎల్లో బౌలర్ ఆర్సీబీ, కింగ్స్ లెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు. 2007 నుంచి 2012 మధ్యలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా టీమిండియా తరఫున ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు.
అయితే, ‘ది లలన్‌టాప్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రవీణ్ మట్లాడుతూ.. ‘ఐపీఎల్ తొలి సీజన్లో ఆర్సీబీకి బదులు ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils)కు ఆడాలనుకున్నా. ఎందుకంటే బెంగళూరు మా స్వస్థలానికి చాలా దూరం. పైగా నాకు ఇంగ్లీష్ బాగా రాదు. అక్కడి ఫుడ్ కూడా నాకు పెద్దగా నచ్చదు.
అప్పుడు ఒకతను నన్ను కాంట్రాక్టుపై సంతకం చేయమన్నాడు. అయితే.. ఆ పేపర్స్ ఆర్సీబీ కాంట్రాక్టు సంబంధించినవని తెలిసి నేను ఒప్పుకోలేదు. దాంతో, లలిత్ మోడీ నన్ను పక్కకు పిలిచి.. బెంగళూరుకే ఆడాలని బెదిరించాడు. కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టకుంటే నా కెరీర్ నాశనం చేస్తానని భయపెట్టాడు’ అని ఈ స్వింగ్ బౌలర్ వెల్లడించాడు.