ఢిల్లీ (Delhi), ఎర్రకోట వద్ద ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకొని జరిగే వేడుకలకు హాజరు కావాలని జనగామ (Janagama) జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్ఎస్ సర్పంచ్ చిత్ర స్వరూపారాణి, భూపాల్‌రెడ్డి దంపతులకు పిలుపు అందింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి నివాసంలో జరిగే తేనీటి విందుకు ఆహ్వనం అందినట్టు సర్పంచ్ స్వరూప రాణి తెలిపారు.
నీటి సమృద్ధి విభాగంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ పురస్కారాన్ని అందుకొన్న తొమ్మిది నెలల్లోనే తాజాగా రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యే మరో అవకాశం వారికి దక్కింది. దీంతో నెల్లుట్ల గ్రామపంచాయతీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ గడ్డపై రెపరెపలాడించారని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ హోం వేడుకలకు రావాలంటూ పిలుపు రావడం తమ అదృష్టంగా ఈ దంపతులు భావిస్తున్నారు..
ఇక వీరి ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర పంచాయితీరాజ్ విభాగం నుంచి తెలంగాణ పంచాయతీరాజ్ కమిషనర్ కు ఇప్పటికే ఆదేశాలు అందాయని సమాచారం.. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టాల్సిందిగా జిల్లా పంచాయితీ అధికారికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, గత ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేతుల మీదుగా సర్పంచ్ స్వరూపారాణి పురస్కారాన్ని తీసుకొన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రపతి ఆఫీస్ నుంచి సర్పంచ్ స్వరూపారాణికి ఆహ్వానం అందింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కేవలం ఎనిమిది మంది సర్పంచ్‌లకే ఈ అవకాశం దక్కగా.. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నెల్లుట్ల సర్పంచ్‌కు చోటు దక్కడం విశేషం.