Telugu News » Telangana : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!? ‘రాష్ట్ర’ ఎక్స్ క్లూజివ్

Telangana : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!? ‘రాష్ట్ర’ ఎక్స్ క్లూజివ్

ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు.. ఒకరితో ఒకరు కలిసే ఛాన్స్ లేదు. దీంతో తెలంగాణలో హంగ్ వస్తే రాష్ట్రపతి పాలన తప్పదు. లోక్ సభకు మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వాటితోపాటు తెలంగాణ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఆదివారం వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

by admin
telangana-elections

– హాట్ టాపిక్ గా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్
– కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినా.. హంగ్ ఊహాగానాలు
– బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్
– తాము కింగ్ మేకర్స్ అంటున్న కమలనాథులు
– హంగ్ వస్తే కలిసే పార్టీలేవి..?
– సంధి కుదరకపోతే రాష్ట్రపతి పాలనే
– అదే జరిగితే.. మరోసారి ఎన్నికలకు ఛాన్స్
– లోక్ సభ ఎలక్షన్ తోపాటు నిర్వహిస్తారా?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

తెలంగాణ (Telangana) లో ఎన్నికల యుద్ధం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆదివారం ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు ధీమాలో ఉన్నాయి. ఎవరికి వారు తామే స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని చెబుతున్నారు నేతలు. కానీ, ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ (Congress) ముందంజలో ఉందని చెప్పినా.. ఎక్కువగా హంగ్ అంచనాలే వినిపిస్తున్నాయి. పైగా, బీజేపీ (BJP) లోని కొందరు నేతలు కూడా దీన్నే గట్టిగా చెబుతున్నారు. తమ పార్టీ కింగ్ మేకర్ అవుతుందని అంటున్నారు. దీంతో తెలంగాణలో మళ్లీ ఎన్నికలు తప్పేలా లేదనే సీన్ కనిపిస్తోంది.

all parties exercise for candidates

తెలంగాణ అసెంబ్లీలో మేజిక్ మార్క్ 60. బీఆర్ఎస్‌ (BRS) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 60 అక్కర్లేదు. 53 సీట్లు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ (MIM) గులాబీ పార్టీకి మద్దతు పలికింది. ఆ పార్టీకి ఎప్పుడూ గెలిచే 7 సీట్లు కచ్చితంగా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తో తేలిపోయింది. ఇప్పటికే కేసీఆర్ ను మళ్లీ సీఎంను చేద్దామని బీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా పిలుపునిచ్చారు ఒవైసీ. అయితే.. బీఆర్ఎస్‌ కు భారీగా సీట్లు తగ్గితే ప్రమాదం తప్పదు. మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఉపయోగం ఉండదు.

హంగ్ అంటూ వస్తే అసలు పరీక్ష కాంగ్రెస్ పార్టీకే ఎదురవుతుంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీకి ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం పెద్ద సమస్య. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడటం కష్టమే. అలాగని బీఆర్ఎస్, బీజేపీతో కలిసే ఛాన్స్ లేదు. ఇప్పటికే హంగ్ అంచనా వేసిన ఆపార్టీ.. తమ నేతలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించాలని చూస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఏ క్షణంలోనైనా బెంగళూరుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను అలర్ట్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కాబట్టి అక్కడైతేనే తమ అభ్యర్ధులు సేఫ్ గా ఉంటారని ఆపార్టీ భావిస్తోంది.

కొన్ని ఎగ్టిట్ పోల్స్ బీజేపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని తెలిపాయి. అయితే.. కమలనాథులు మాత్రం తమకు 25 నుంచి 30 రావొచ్చని అంచనాలో ఉన్నారు. ఎన్నికల తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. తెలంగాణలో ఈసారి హంగ్ రావొచ్చని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, బీజేపీ ఈసారి 25 నుండి 30 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కింగ్ మేకర్‌ కాబోతుందని.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిగిలిన నేతల్లో కొందరు ఇదే రాగం అందుకున్నారు.

మ్యాజిక్ ఫిగర్ కు కొద్దిగా దూరంలో ఏ పార్టీ నిలిచినా.. తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకోవటం ఖాయం. అధిక స్థానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇస్తారు. ఆ సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ పార్టీలు కలుస్తాయనేది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కి సీట్లు తక్కువ పడితే కింగ్ మేకర్ పాత్రకు మజ్లీస్ పార్టీ రెడీగా ఉంది. అప్పటికీ తగ్గితే కాంగ్రెస్ ని నిలువరించేందుకు చివరి నిముషంలో బీజేపీ మద్దతు ఇస్తుందేమో చూడాలి. అయితే.. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్న కమలనాథులు.. ఆయనతో కలిస్తే ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్న కొద్దిపాటి ఇమేజ్ డ్యామేజ్ కావడం ఖాయం.

ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు.. ఒకరితో ఒకరు కలిసే ఛాన్స్ లేదు. దీంతో తెలంగాణలో హంగ్ వస్తే రాష్ట్రపతి పాలన తప్పదు. లోక్ సభకు మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వాటితోపాటు తెలంగాణ అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఆదివారం వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

You may also like

Leave a Comment