పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి ప్రధాని మోడీ(Pm modi) తెలంగాణ పర్యటన(Telangana tour Fix) ఫిక్స్ అయ్యింది. ఈనెల 30వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ పార్లమెంట్(Zaheerabad parliament) పరిధిలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. ఆ నియోజకవర్గంలోని జోగిపేట అల్లదుర్గ్‌లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మోడీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. డబుల్ డిజిట్ ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యంగా మోడీ సభను నిర్వహిస్తుండగా.. భారీగా జనసమీకరణ చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి నాలుగు సిట్టింగ్ ఎంపీ స్థానాలున్నాయి. మే 13న తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే, సిట్టింగ్ స్థానాలతో పాటు కొత్తగా మరికొన్ని స్థానాలు గెలుపొందే విధంగా బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రచార సభలను, ర్యాలీలను చేపడుతోంది. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయే అని ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.