మహారాష్ట్ర(Maharashtra)రాజధాని ముంబై ఎయిర్ పోర్ట్(Mumbai Airport)లో ఒక ప్రైవేట్ విమానం రన్‌వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
అప్రమత్తమైన ఫైర్, రెస్క్యూ బృందాలు వెంటనే ఆ రన్‌వే వద్దకు చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరులోని రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్‌ఎస్ వెంచర్స్ కు చెందిన లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్, గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం(Visakhapatnam)నుంచి టేకాఫ్ అయ్యింది.
ముంబై ఎయిర్‌పోర్ట్ లో ల్యాండింగ్ సందర్భంగా రన్‌వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. కాగా, ప్రమాద సమయంలో ఆ ప్రైవేట్ విమానంలో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది.
ముంబై విమానాశ్రయంలోని రన్‌వే 27లో ల్యాండింగ్ సందర్భంగా విమానం చక్రాలు రన్‌వేపై స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. భారీగా వర్షం కురుస్తుండటం వల్ల రన్‌వే సరిగా కనిపించకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.