బీఆర్ఎస్ (BRS) నేతలపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే (Priyank Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు. తాము అసలు హామీలు అమలు చేస్తున్నామా? లేదా అనే విషయం ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక గురించి అసలు బీఆర్ఎస్ నేతలకు ఏం తెలుసని ఆయన నిలదీశారు.
కర్ణాటకలో అర్హులందరికీ పథకాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటేనే భరోసా అని ఆయన అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తాన్నామని తెలిపారు. గ్యారెంటీలను అమలు చేయడం లేదని ఎందుకు బద్నాం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పది ప్రధాన పథకాల పేరిట పది లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
ఆయా పథకాల ద్వారా కేసీఆర్ కుటుంబం లబ్ది పొందిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బ్రష్టచార రాష్ట్రీయ సమితి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు పరస్పర సహకారంతో దోపిడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీతో కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాడని, గల్లీలో కుస్తీ తరహాలో వ్యవహరిస్తున్నాడన్నారు.
గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లో తిరుగుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఇక్కడి సమస్యలను పక్కను బెట్టి కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారి నిప్పులు చెరిగారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, పక్క రాష్ట్రంపై పడి ఏడవడం బంద్ పెట్టాలన్నారు. పేదలందరికీ కర్ణాటకలో మేలు జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోని చూసి భయపడుతోందన్నారు.