తెలంగాణ ప్రజల బాధలను కేసీఆర్ (KCR) సర్కార్ పట్టించుకోలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని తెలిపారు. కానీ అలా జరగలేదని విమర్శించారు. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేవన్నారు.
ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని సోనియా గాంధీ తనతో చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిన్న రాత్రి సోనియాగాంధీతో తాను మాట్లాడానన్నారు. అప్పుడు ఎక్కడున్నావు అని సోనియాగాంధీ అడిగానన్నారు. తాను రేపు మధిర వెళ్తున్నానని చెప్పారు. తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా పోరాడారో తనకు తెలుసని సోనియా గాంధీ చెప్పారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
ప్రశ్న పత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఆలోచిస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రమే బాగుపడ్డారని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో ఉన్న పెద్ద ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. కమీషన్ల పేరుతో ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ నేతలు కృషి చేయరని మండిపడ్డారు.
పేదలు ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని బీఆర్ఎస్ సర్కార్ చెప్పిందన్నారు. ఆ హామీని నెరవేర్చలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సంపదను పంచుకోవడంలోనే బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారని విరుచుక పడ్డారు. దేశంలో ప్రజలే నాయకులని.. ప్రజల కంటే అతీతులు అన్న మాదిరిగా మోడీ, కేసీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు.