కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బీజేపీ(BJP) ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వేదికగా శనివారం ఆమె ఓ పోస్ట్ చేశారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం(Indian Government) రూ.14కోట్ల అప్పు తీసుకోబోతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోందని, ఈ రుణం ఏం చేయబోతోందని ప్రశ్నించారు.
ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు చేశారంటూ ప్రియాంకా గాంధీ నిలదీశారు. పెద్ద కోటీశ్వరుల రుణమాఫీకి ఎంత డబ్బులు వెచ్చించారని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరిగిపోతుంటే సామాన్య ప్రజానీకానికి ఊరట లభించే బదులు బీజేపీ ప్రభుత్వం ప్రజలను మరింత అప్పుల్లోకి తోసే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దాదాపు రూ.150 లక్షల కోట్ల రుణం తీసుకుందని, దీని ప్రకారం నేడు దేశంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ.1.5 లక్షల అప్పు ఉందన్నారు.
ప్రియాంకాగాంధీ తన ట్వీట్లో ‘కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎవరికి ప్రయోజనం కోసం వినియోగిస్తున్నారని అడిగారు. దేశ నిర్మాణానికి ఉపయోగించారా..? లేక ఉద్యోగాలను పెద్దఎత్తున సృష్టించారా? రైతుల ఆదాయం రెండింతలు పెంచారా? పాఠశాలలు, ఆస్పత్రులు వచ్చాయా? ప్రభుత్వ రంగం బలపడిందా? ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయా? బిలియనీర్ల కోసం ఎంత ఖర్చు చేశారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవన్నీ జరగకుంటే మరి ఆ డబ్బునంతా ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు రూ.55లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. కేవలం పదేళ్లలోనే మోడీ నేతృత్వంలో రూ.205 లక్షల కోట్లకు పెరిగిందని విమర్శించారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వం కొత్త రుణం తీసుకునేందుకు సిద్ధమవుతోందని ప్రియాంకా గాంధీ మండిపడ్డారు.