జార్ఖండ్ భూ కుంభ కోణానికి సంబంధించిన మనీలాండరింగ్ (money laundering)కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)ను ప్రశ్నించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని ఆయన నివాసం వద్దకు ఈడీ అధికారులు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న హేమంత్ సోరెన్ హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరినట్టు తెలుస్తోంది. ఈడీ విచారణకు ఆయన హాజరు కానున్నట్టు సమాచారం. అంతకు ముందు మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ శనివారం నోటీసులు పంపింది. జనవరి 29 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక దానికి విచారణ తేదీగా ఎంచుకోవాలని సీఎంకు సూచించింది. కానీ దానిపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.
దీంతో ఈడీ అధికారులు నేరుగా ఢిల్లీలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సోరెన్‌ను ఈ నెల 20న సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆ సమయంలోనే ఈ కేసులో మొదటి సారిగా సోరెన్ స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. ఈ నెల 20న విచారణ ఇంకా పూర్తి కాకపోవడంతో శనివారం ఆయనకు మరోసారి నోటీసలు పంపినట్టు సమాచారం.
అంతకు ముందు ఈ నెలలో సోరెన్ మీడియా సలహాదారు నివాసంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. దీంతో పాటు అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022 నుంచి ఈ కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మంది ఐఏఎస్‌లను ఈడీ అదుపులోకి తీసుకుంది.