‘మహాలక్ష్మీ’ (Maha Lakshmi) పథకం కింద ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం అమలు తీరును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. జేబీఎస్‌లో ఆయన విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ పథకంపై బస్టాండ్‌లో ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ….. మహిళలపై ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకంలో ఆర్టీసీని భాగస్వామిని చేసినందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
సిటీ ఆర్డినరీ బస్సు, పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణించే మహిళలు తమ స్థానికతను ధ్రువీకరించేందుకు ఆధార్ కార్డులను ఆర్టీసీ సిబ్బందికి చూపించాలని కోరారు. ఈ విషయంలో తమ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం అమలులోకి రాగానే భారీగా రద్దీ పెరిగిందని తెలిపారు.
పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పథకం అమలులో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు. సమస్యల గురించి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. దీనిపై తాము చర్యలు తీసుకుంటామన్నారు.