కేసీఆర్ (KCR) ప్రభుత్వ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) తో కలిసి పోరాటం చేసిన టీజేఎస్ (TJS) అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) కు ఎట్టకేలకు పదవి వరించింది. ముందుగా ఊహించినట్టే ఎమ్మెల్సీగా ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కోదండరాంతో పాటు జర్నలిస్ట్ మీర్ అమీర్ అలీఖాన్ నియమితులయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య బుధవారం సాయంత్రం కీలక సమావేశం జరిగింది. పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఈ భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే రాజ్ భవన్ నుంచి నిర్ణయం వెలువడింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతేడాది జూలై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేశారు. అయితే.. సెప్టెంబర్ 25న ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. గవర్నర్ కావాలనే అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. చివరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
నవంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో గతంలో భర్తీ చేయకుండా ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను పూర్తి చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ స్థానాలకు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ల పేర్లను సిఫారసు చేసింది. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కోదండరాం ను ఎమ్మెల్సీ చేయడంతో మంత్రి పదవి కూడా ఇస్తారని అనుకుంటున్నారు.