గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి (Dharani)తో ఇష్టానుసారంగా భూములు రాయించుకోవాలని చూశారని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం (Prof Kodandaram)ఆరోపించారు. న్యాయాన్ని పక్కన పెట్టి సొంతానికి పాలన చేస్తే ధరణి పోర్టల్ మాదిరిగా ఉంటుందని నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ బేగంపేట ‘ది హరిత ప్లాజా’లో తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పాలనలో జరిగినంత విధ్వంసం ఎప్పుడు చూడలేదని విమర్శలు గుప్పించారు. రావణుడి చేతిలో సీతమ్మ బంది అయినట్లు ఈ పదేండ్ల పాటు తెలంగాణ బందీ అయ్యిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కేసీఆర్ సింహాసనాన్ని గానీ, ఫామ్ హౌస్లో భాగం కానీ అడగలేదని పేర్కొన్నారు. కేవలం చట్ట బద్దంగా పని చేయాలని కోరామన్నారు.
పేదలకు మేలు చేసే విధంగా చట్టాలు రావాలని కోదండరాం కోరారు. గ్రామ స్థాయి వరకు యంత్రాంగం ఉండాలని అన్నారు. నియమాలు, తప్పులు దొర్లకుండా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతా చట్టబద్దంగా పని చేయాలని పిలుపు నిచ్చారు. పాలకుల కోసం కాకుండా అధికారుల కోసం పని చేయాలని తెలిపారు.