పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా. పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా.. అంటూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రజా యుద్ధనౌక ఊపిరి ఆగిపోయినా ఇప్పటికి ఆయన జ్ఞాపకాలు తెలంగాణ ఉద్యమకారుల్లో పదిలంగా ఉన్నాయి. కానీ ఆయన ఆశయాలు మాత్రం అంతిమ దశలో కొట్టుమిట్టాడుతున్నాయని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూసి అనుకుంటున్నారు కొందరు.
మరోవైపు తెలంగాణ ఉద్యమం సమయంలో తన వంతు పాత్రని సమర్థవంతంగా పోషించిన ప్రొఫెసర్ (Professor)కోదండరాం.. రాజకీయ వ్యూహాల వల్ల ఉనికిని కోల్పోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న కోదండరాం.. రాష్ట్రం అన్యాయం అవుతుందని సమయం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు..
ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గద్దర్ చనిపోయే ముందు అన్న మాటలను ఆచరణలో పెట్టే సమయం వచ్చిందని కోదండరాం (kodandaram) పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి చరమగీతం పాడాలని వెల్లడించారు. గోదావరిఖనిలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరాం ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకోవడం కోసం కొట్లాట, రాష్ట్రం వచ్చాక అభివృద్ధి కోసం పోరాటం అనేది ప్రొఫెసర్ జయశంకర్ ఆశయమని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులకు పదవులు, కీర్తి, కిరీటాలు కాదు తెలంగాణ అభివృద్ధి ముఖ్యమని తెలిపిన కోదండరాం.. ఉద్యమం పేరు చెప్పుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వారు నిజమైన ఉద్యమకారులా అని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) సీఎం అయ్యాక రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి.. వనరులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపినందుకే మా పై దాడులకు పాల్పడి.. చాలా కేసులు పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవలసిన అవసరం ఎంతగానో ఉందని.. గద్దర్ చనిపోయే ముందు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్న మాటలను ఆచరణలో పెట్టి.. రాష్ట్రాన్ని కాపాడుకుందామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు..