నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో ప్రోటోకాల్ (Protocol) వివాదం రచ్చ రచ్చగా మారింది.. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రోటోకాల్ పాటించకుండా తమను పిలిచి అవమానించారంటూ స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Kuchukulla Rajesh Reddy) ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేత పాఠశాల ప్రారంభించడంపై కూచుకుళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకొంది..
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో.. ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే హాజరయ్యే సమయానికి కంటే ముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) చేత పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. అదీగాక పాఠశాల భవనానికి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కాంగ్రెస్ (Congress) నేతలు, ప్రజా ప్రతినిధులు అంతా విద్యాశాఖ అధికారి గోవిందరాజులను ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. దీంతో ప్రతిఘటించిన పోలీసులు వెంటనే డీఈఓ ను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. మరోవైపు తనను ప్రారంభోత్సవానికి పిలిచి అవమానించారని రాజేష్ రెడ్డి ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించని డిఈఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన సొంత ట్రస్ట్ ద్వారా సిర్సవాడ గ్రామంలో ఉన్నత పాఠశాలలను నిర్మించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. పాఠశాల భవనం పూర్తయిన క్రమంలో ప్రభుత్వానికి అప్ప చెప్పాల్సి ఉంది. అందుకే జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదికాస్త ఇద్దరి మధ్య మంట పెట్టింది.