సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన సమీక్షా సమావేశం (Review Meeting)లో రచ్చ జరిగింది. హరిత హోటల్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ నడిచింది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)కి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.
కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి జాతర ఏర్పాట్లపై హరిత హోటల్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. మంత్రితో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వేదికపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వేదిక పైకి రావాల్సిందిగా కొండా సురేఖ కోరారు. దీనిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓడి పోయారని పల్లా అన్నారు. ఓడిపోయిన వ్యక్తిని వేదికపైకి ఎలా పిలుస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. అసలు ప్రోటోకాల్ ఒకటి ఉంటుందని, కాంగ్రెస్ దాన్ని పాటించలేదని పల్లా తెలిపారు. కానీ ఈ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరగడం లేదని అందుకే ప్రోటో కాల్ వర్తించదని కొండా సురేఖ అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తి స్టేజి మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. మల్లిఖార్జున స్వామిని దోచుకునేందుకే కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపణలు చేశారు. 30 ఏండ్ల చరిత్రలో ఏనాడు కూడా సమావేశం హోటల్లో పెట్టలేదన్నారు.