కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ, రైతులు ఢిల్లీ (Delhi) ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ అంశంపై వివాదం రగులుకొంటుంది. అయితే వీరిని అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు హర్యానా (Haryana), ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి. ఈ క్రమంలో నిన్నటి నుంచి ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో పోలీసులు.. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌లను ప్రయోగించి రైతులను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ (Modi)కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.. అయితే రైతుల ఆందోళనలో పాల్గొంటున్న పలువురు వ్యక్తులు ప్రధాని లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా ప్రధానిని హెచ్చరిస్తూ.. గతంలో పంజాబ్ (Punjab) వచ్చిన మోడీ ఆ సమయంలో తప్పించుకున్నారని, ఈ సారి వస్తే మాత్రం అతడిని ఎవరూ రక్షించలేరంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి..
మరోవైపు గత సంవత్సరం 2022, జనవరి నెలలో ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఫిరోజ్‌పూర్ వద్ద భద్రత ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ ఫ్లై ఓవర్‌పై కొన్ని నిమిషాల వరకు నిలిచిపోయింది. సరైన భద్రత కల్పించడంలో పంజాబ్ పోలీసులు విఫలం అయ్యారనే ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇక గత రెండు, మూడేళ్ల కిందట తమ ఉద్యమంతో దేశ రాజధాని ఢిల్లీని దిగ్భందం చేసిన రైతులు మరోసారి అదే స్థాయిలో ఉద్యమం చేపట్టడం.. అందులో ఎన్నికల సమయం కావడంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు ఉద్యమ బాట పట్టారు.
కనీస మద్దతు ధర, రాయితీలు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు మొత్తం 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఇదిలా ఉండగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా ప్రధాన రహదారుల్లో క్రేన్లు, కంటెయినర్లను అధికారులు సిద్ధం చేశారు. వీటిని దాటుకుని ఢిల్లీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తే రోడ్లను, అవసరం అనుకొంటే సరిహద్దులను సైతం మూసివేయడానికి సిద్ధమయ్యారు.