దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయిలో పెరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున సంగతి తెలిసిందే. వాయుకాలుష్యంతో ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం గమనించిన ఢిల్లీ ప్రభుత్వం.. చలికాలంలో వాయు కాలుష్యం పెరగడానికి కారణం.. చుట్టూ పక్కల ఉన్న గ్రామాల రైతులు పంట వ్యర్థాలను కాల్చడం అని గుర్తించి చర్యలు చేపట్టింది.
మరోవైపు పంజాబ్‌తోపాటు హర్యానా, ఢిల్లీల్లో పంట వ్యర్థాల మంటలు కాలుష్యానికి కారణం అవుతుండటంతో ఆయా ప్రభుత్వాలు పంటలను కాల్చడం పై నిషేధం విధించాయి. ఇందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని బటిండా (Bathinda)గ్రామంలో పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) ఆపడానికి వెళ్లిన ప్రభత్వ అధికారిని రైతులు అడ్డుకున్నారు.
స్థానిక వ్యవసాయ సంఘానికి చెందిన సుమారు 60 మంది రైతులు.. ఆ అధికారిని చుట్టూ ముట్టి సమీపంలో ఉన్న వరిగడ్డి కుప్ప దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న గడ్డి కుప్పకు నిప్పు అంటించాలని ఒత్తిడి చేశారు. చేసేదేం లేక ఆ అధికారి అగ్గి పుల్లతో గడ్డిని కాల్చాడు. కాగా ఈ ఘటనకి సంబంధించిన వీడియోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. రైతుల చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. వాయు కాలుష్యానికి కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వెంటనే పోలీసులు, అధికారిని అడ్డుకున్న రైతులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యానికి కారణం రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే అని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. అప్పటికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కాలుష్యాన్ని మాత్రం తగ్గించలేక పోతుందనే విమర్శలు వస్తున్నాయి.