ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ముగ్గరం పొత్తు కుదుర్చుకున్నామని చెప్పారు.
విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పురందేశ్వరి కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకిత భావంతో పనిచేస్తోందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులనే కాదని, కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రతీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. జెండాలు వేరైనా తమ అజెండా ఒకటేనని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంలాంటిదని అభివర్ణించారు.
పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైందని, అయితే రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ హైకమాండ్ భావించినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని రాష్ట్రంలో పెద్దఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టకూడదని రాజ్యంగంలో ఏమైనా రాశారా? అని వైసీపీ నేతలు అనడం సబబుకాదన్నారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నిధులు దారి మళ్లించారని దుయ్యబట్టారు.