రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించడం లేదనడం అవాస్తవమని ఏపీ(AP) బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) అన్నారు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇవాళ(శనివారం) ఆమె పర్యటించారు. జంగారెడ్డిగూడెం(Jangareedy gudem) సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. నీళ్ళు తోడుకొడానికి ఉపయోగించుకోవాల్సిన పోలవరం ప్రాజెక్టును డబ్బు తోడుకునెందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పోలవరం నిర్మాణానికి ప్రతీ రూపాయి కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని పురంధేశ్వరి తెలిపారు.
త్వరలో వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు పోలవరంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఓటుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రాలో అభివృద్ధి ఎలా ఉన్నా ప్రజల జీవితాలతో మాత్రం వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు.
పెట్టుబడులు పక్క రాష్ట్రాలు వాళ్ళు తీసుకుపోతున్నా సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతి రాజధాని అని ప్రకటించిందని.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని పురంధేశ్వరి వెల్లడించారు.
ఒక్క ఏలూరు జిల్లాకే లక్ష ఇళ్ల కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు. 22లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పూర్తి చేసిందో శ్వేత పత్రం ఇవ్వాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే, ప్రతీ ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలని, డిమాండ్ చేశారు.