ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ(BJP)నే ప్రధాన ప్రతిపక్షమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతిలో ఇవాళ (గురువారం) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
పార్లమెంటు ఎన్నికలు ఎంతో దూరంలో లేని.. ఎన్నికల అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని పురంధేశ్వరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదనే అపోహను తొలగించాలన్నారు.
పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతినిధులే ప్రధాన భూమిక పోషించాలన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని విమర్శించారు. కేవలం తిరుపతి నియోజకవర్గంలోనే 30 వేల దొంగ ఓట్లున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఏక కాలంలో అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు.