మిచాంగ్ తుపాన్ సహాయక చర్యల్లో సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheshwara rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు వసతి, భోజనం ఏర్పాటు చేయలేని ప్రభుత్వం ఎందుకన్నారు.
అయితే, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హుద్ హుద్ లాంటి మహాప్రళయంలో ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా తితిలీ తుపాను వల్ల బాధితులకు నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని జగన్ సర్కార్ తగ్గించడం దుర్మార్గమన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించే తీరిక లేని సీఎం జగన్ తాడేపల్లిలో పబ్జి ఆడుకుంటున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.
అదేవిధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆహారాధాన్యాలతో పాటు ఉద్యానవన పంటలతో సహా పలు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టపోయిన రైతాంగాన్నివెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యానవన పంటల సాగుదారులకు వెంటనే ఆర్థిక సాయాన్ని అందించాలన్నారు. అసైన్డ్ భూముల్లో సాగు చేసిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని పురంధేశ్వరి కోరారు. అయితే భీమా చేసిన రైతాంగం ఎంతమంది.. లేనివారు ఎంతమంది అనే గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం వల్ల రైతాంగం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు చేరింది. 12 అడుగుల గరిష్ఠ నీటి మట్టం దాటి నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పది గేట్లు అడుగు మేర ఎత్తి 5,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజికు వరదనీరు చేరుతోంది.