ఖమ్మంలో రాజకీయాలు ఉత్కంఠంగా మారుతోన్న నేపథ్యంలో మంత్రి (Minister) పువ్వాడ అజయ్ (Puvvada Ajay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ భవన్లో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ.. కాంగ్రెస్ (Congress) పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏం లేదని, హస్తం పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు.
కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను కాపీ కొట్టారని పువ్వాడ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు (Rythu Bandhu) ఆసరా పింఛను (Aasara Pension) బీఆర్ఎస్దా ?.. కాంగ్రెస్ పార్టీదా ?.. ఆలోచించాలన్నారు. ఈసారి కూడా తమ పార్టీకి 88 నుంచి 90 స్థానాలు వస్తాయని పువ్వాడ అజయ్ ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాను సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. పదేండ్ల పాటు ఖమ్మం నగర ప్రజలతో మమేకమయ్యానని చెప్పారు. ఇప్పుడు తిరిగే నాయకులు నగరానికి కష్టం వచ్చినప్పుడు కనబడలేదన్నారు. ఖమ్మం నగరానికి సీఎం కేసీఆర్ ఏం కావాలన్నా చేస్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కూడా పాల్గొన్నారు.