అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్(Congress Government) చేతగాని తనం నిరూపితమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay Kumar) విమర్శించారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సాగునీటి సమస్యే కాదు.. ప్రజలు కరెంటు కోతలతో సతమతమవుతున్నారని తెలిపారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో చెరువులు, కాల్వలు సాగునీటితో కలకలలాడేవని గుర్తుచేశారు. 24గంటల నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేదన్నారు. నాలుగు నెలలుగా కాంగ్రెస్ సర్కార్ అటు రైతులను, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోందని దుయ్యబట్టారు. చేతుల్లో ఉన్న వ్యవస్థను పదేళ్లు కాపాడుకున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లను తాగునీటిగా తీసుకోలేని పరిస్థితి అన్నారు. మార్చిలోనే తాగునీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని, ఇక ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మరోవైపు నాలుగు నెలలుగా రైతుబంధు పడక రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వర రావు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా సరిహద్దు వద్ద ఎంపీ నామ నాగేశ్వరరావు వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతు బిడ్డగా నాలుగు నెలలుగా ప్రజలు పడుతున్న కష్టాలు తనకు తెలుసని, ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేశామా? అని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని అన్నారు. అందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఒక పండుగలా జరిగిందని వ్యాఖ్యనించారు. బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. తాము రెండు సార్లు హెలికాప్టర్ లో వస్తే నీళ్లు, పచ్చని పొలాలు కనిపించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.