అప్పుల ఊబిలో కూరుకు పోతున్న భారత్ (India)ను ఆర్థిక సంస్కరణలతో ఒడ్డున పడేసిన గొప్ప పాలనాధక్షుడు, మేధావి పీవీ నరసింహరావు (PV Narasimha Rao). స్వాతంత్ర్యం వచ్చిన ఐదు దశాబ్దాల తర్వాత కుదేలైన ఆర్థిక వ్యవస్థకు సత్తువ పెంచి పరుగులు పెట్టించిన గొప్ప వ్యక్తి. ఆర్థిక సరళీకరణతో దేశ రూపు రేఖలనే మార్చిన సంస్కరణల రుషి పీవీ. అలాంటి పీవీని కేంద్రం భారత రత్న ఇచ్చి గౌరవించడం గర్వించదగిన విషయం.
28 జూన్ 1921న నాటి కరీంనగర్ జిల్లా నర్సంపేట మడలం లక్నేపల్లిలో పీవీ నరసింహరావు జన్మించారు. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహరావు. ఉస్మానియా యూనివర్శిటీ, బాంబే, నాగ్ పూర్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశారు. 1938లో ఉస్మానియాలో చదవుతున్న సమయంలో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత కాంగ్రెస్ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.
ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలు పెట్టి మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పని చేశారు. 1962-64 కాలంలో న్యాయ, సమాచార శాఖల మంత్రిగా, 1967లో వైద్యారోగ్య శాఖ మంత్రి, 1968-71లో విద్యాశాఖ మంత్రిగా, 1971-73 ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 1980 – 84 విదేశాంగ మంత్రి
1984-1985 రక్షణ మంత్రి, 1985 మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.
1991 నుంచి 1996 వరకు భారత ప్రధాన మంత్రి ఆయన తన సేవలందించారు. ప్రధానిగా పని చేసిన కాలంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు వచ్చారు. తద్వారా భారత్ ను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు. లైసెన్స్ – పర్మిట్‌రాజ్ బంధనాల నుంచి ఆర్థిక వ్యవస్థకు విముక్తి కలిగించి దేశాన్ని అంతర్జాతీయంగా ముందు వరుసలో నిలబెట్టిన ఘనత ఆయన సొంతం.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టకు ముందు దేశం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోగా….ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక అభివృద్ధి దిశగా దేశం అడుగులు వేసింది. ఒకప్పుడు విదేశీ రుణం కోసం ఎన్నో తిప్పలు పడే కాలం నుంచి రుణాలు వెల్లువలాగా దేశంలో వచ్చి పడే పరిస్థితిని తీసుకు వచ్చారు. పీవీ పాలన కాలంలోనే పారిశ్రామిక రంగం కొత్త రూపు సంతరించుకుంది.
దేశంలో స్వేచ్ఛా వాణిజ్యానికి బాటలు వేశారు. రావు-మనోహర్ నమూనా ఫలితంగా దేశం పూర్తి తిరిగి నిలదొక్కుకుంది. వేగంగా ఆర్థికాభి వృద్ధి సాధించేందుకు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ – ఎల్పీజీ విధానాలను అమలు చేశారు. పారిశ్రామిక లైసెన్సులు ఎత్తివేయటం, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించటం, వృద్ధిరేటు పెంపు, ప్రాంతీయ అసమానతలు తగ్గించే లక్ష్యాలతో ఈ సంస్కరణలను పీవీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.
ఫలితంగా దేశీయంగా పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించారు. వ్యాపార అనుకూల విధానాలను చాలా వరకు ప్రోత్సహించారు. నూతన ఆర్థిక విధానంలో భాగంగా ప్రైవేటీకరణ ప్రక్రియకు పెద్దపీట వేశారు. పబ్లిక్ రంగ సంస్థల యాజమాన్యం, ఆస్తులు ప్రైవేటు పరం చేయడంతో సంస్థ యాజమాన్య సామర్థ్యం మెరుగుపడి, ఆర్థిక సమర్థత పెరుగుతుందన్న వాదం బలపడింది.