భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు భారత అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించడంపై ప్రముఖులు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy) ‘తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమన్నారు.
తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిదని అభివర్ణించారు. అదేవిధంగా మాజీ పీఎం చరణ్‌సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, శాస్త్రవేత్త స్వామినాథన్‌లకు భారతరత్నం రావడం సంతోషకరం అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తమ డిమాండ్‌ను గౌరవించి పీవీకి భారతరత్న ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీకి దేశ అత్యున్నత పురస్కారం దక్కడం హర్షనీయమన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో కేసీఆర్ పేర్కొన్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ‘భారత రత్న’తో గౌరవించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు.’మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పీవీఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని గుర్తుచేశారు.. అప్పటి నుంచి ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నామని కేటీఆర్ ట్వీట్లో రాసుకొచ్చారు.
అదేవిధంగా పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ‘పీవీకి భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారత్‌ను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారతరత్నతో సత్కరించారని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ ఇది సంతోషకరమైన విషయమని ట్వీట్లో పేర్కొన్నారు.