ఒక దేశాధినేత మరో దేశంలో పర్యటిస్తున్నాడంతే హంగూ ఆర్భాటాలు మామూలుగా ఉండవు. స్వాగత ఏర్పాట్లు మామూలుగా ఉండవు. అధికారులు ఏమాత్రం తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తారు. పుష్పగుచ్ఛాలు అందజేసి సైనిక వందనం సమర్పిస్తారు. తమ ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం చేస్తారు. ప్రధానితో పాటు, మంత్రులు ఆయన రాకకోసం వేచిచూసి ఘన స్వాగతం పలుకుతారు.
అయితే, జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ (Frank-Walter Steinmeier)కు ఊహించని అనుభవం ఎదురైంది. ఖతార్‌లో(Qatar) పర్యటన నేపథ్యంలో విమానం దోహాలో(Doha) చేరుకున్నారు. జర్మన్ ఎంబసీ అధికారులు, సైనికులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎంబసీ అధికారులు, సైనికులు స్వాగతం పలికేందుకు సిద్ధంగానే ఉన్నారు.
అయినా అధ్యక్షుడు ఫ్రాంక్ విమానం దిగలేదు. అంతేకాదు.. అరగంటపాటు చేతులు కట్టుకుని విమానం మెట్ల వద్ద అలాగే నిలబడి చూశారు. దీనికి కారణమేంటటే.. ఖతార్ మంత్రులు సమయానికి అక్కడి చేరుకోలేకపోయారు. దీంతో ఆయన వారు వచ్చే వరకూ అలాగే నిలబడి ఉండడంతో చర్చనీయాంశమైంది.
ఎట్టకేలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుల్తాన్ అల్ మురైచాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పుడుగాని జర్మనీ అధ్యక్షుడు విమానం దిగిరాలేదు. అనంతరం ఆయన ఖతార్ రాజు షేఖ్ తమిమ్ ఇన్ అహ్మద్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకున్నారు. అనంతరం ఆయన స్వదేశానికి పయనమయ్యారు. అలా ఆయన పర్యటన మూడుగంటల్లోనే ముగిసిపోయింది.