హైదరాబాద్(Hyderabad)లో అనుమతి లేని నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్(Quthbullapur) నియోజకవర్గంలో అక్రమ కట్టడాలను(Illegal Constructions) పోలీసులు, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
దేవేందర్ నగర్, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలోని అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు, బేస్మెంట్ నిర్మాణాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను తొలగించారు. దీంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను కూల్చొద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డగించి అరెస్ట్ చేశారు.
కుత్బుల్లాపూర్ మండల పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. పోలీసుల బందోబస్తు నడుమ దాదాపు ఉదయం నుంచి 200 ఇళ్లను కూల్చివేశామని, మిగతా వాటిని కూడా పూర్తిగా కూల్చి వేస్తామని తెలిపారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి, నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని శ్యామ్ ప్రకాశ్ గుప్తా హెచ్చరించారు. కొందరు దళారులు, నాయకులు నకిలీ పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగట్టి తప్పించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఎవరూ ఇలాంటి వారిని నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆర్డీవో స్పష్టం చేశారు.