Telugu News » Rachakonda Crime : మూడు కమిషనరేట్లలో క్రైమ్ రేట్ పైపైకి..!

Rachakonda Crime : మూడు కమిషనరేట్లలో క్రైమ్ రేట్ పైపైకి..!

గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం నేరాల సంఖ్య పెరిగిందన్నారు సీపీ. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరగగా.. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి.

by admin

హైదరాబాద్ (Hyderabad) నగరం, పరిసర ప్రాంతాలు నేరాలకు అడ్డాగా మారాయి. ఈ ఏడాది విడుదల చేసిన క్రైమ్ రేట్ ను చూస్తుంటే ఇది అర్థం అవుతోంది. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది నేరాలు పెరిగాయి. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని క్రైమ్ రేట్ ను వివరించగా.. తాజాగా రాచకొండ (Rachakonda) పరిధిలోని నేరాల వివరాలను వెల్లడించారు సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu). గతేడాది 27,664 కేసులు నమోదు అవగా.. ఈ ఏడాది 29,166 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

గత ఏడాదితో పోలిస్తే 6.8 శాతం నేరాల సంఖ్య పెరిగిందన్నారు సీపీ. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరగగా.. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ, పిల్లలపై లైంగిక వేధింపులు, హత్యలు, కిడ్నాప్‌ ల కేసులు పెరిగాయి. మాదకద్రవ్యాల కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు సీపీ. 282 మత్తు పదార్థాల కేసుల్లో 698 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

ఈ ఏడాది నేరాల్లో 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు సుధీర్ బాబు. కన్విక్షన్ రేట్ 62 శాతం పెరిగిందన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని.. సైబర్ నేరాల్లో 42 మంది అంతరాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలోని 89.92 లక్షలకు నగదును ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించామన్నారు.

మరోవైపు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కూడా క్రైమ్ రేట్ పెరిగింది. హైదరాబాద్ లో కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్​ రేట్ ​2 శాతం పెరిగింది. ఆర్థిక నేరాలు, మహిళలపై దాడులు, చోరీలు, సైబర్ నేరాలూ పెరిగాయి. నిరుడు 24,220 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 24,821 కేసులు రిజస్టర్ అయ్యాయి. అలాగే, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది సైబర్‌ నేరాలు 10 శాతం మేర పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. ఇతర నేరాలు కూడా 7 శాతం పెరిగాయి.

You may also like

Leave a Comment