కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో విద్యార్థినుల ర్యాగింగ్(Ragging) కలకలం రేగింది. వర్సిటీ మహిళా హాస్టల్లో జూనియర్ విద్యార్థినులపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడుతుండటం చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏకంగా 81 మంది స్టూడెంట్స్‌ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండైన వారిలో జువాలజీ విభాగంలో 25 మంది, కామర్స్, ఎకానమిక్స్ విభాగాల్లో 28 మంది చొప్పున ఉన్నారు. మూడు రోజుల కిందట ఫ్రెండ్లీ పరిచయాలతో తనను సీనియర్ విద్యార్థినులు ర్యాంగింగ్ చేశారని కామర్స్ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తమను రాత్రివేళల్లో వర్సిటీ హాస్టల్స్ గదిలోకి పిలుచుకుని పరిచయం చేసుకోవాలని సీనియర్ విద్యార్థులు దురుసుగా మాట్లాడుతున్నట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.వెంకయ్య విచారణ నిర్వహించి మూడు రోజుల్లో వరుసగా 81మందిని సస్పెండ్ చేశారు.
మరోవైపు హాస్టల్ డైరెక్టర్ సమక్షంలో పరిచయ కార్యక్రమం పూర్తైనప్పటికీ విద్యార్థినులు హాస్టల్లో మరోసారి పరిచయ కార్యక్రమం పేరుతో ర్యాగింగ్ చేయడాన్ని యాంటీ లాగిన్ కమిటీ నిర్ధారించిందని హాస్టల్ డైరెక్టర్ వెల్లడించారు. క్యాంపస్‌లోని ఆడిటోరియం దగ్గరకు తమను బలవంతంగా పిలిపించారని, అక్కడ రైళ్లలో పల్లీలు అమ్ముకునే తీరును తమకు చూపాలని, పాటలు పాడాలని, డ్యాన్స్ చేయాలని వేధింపులకు గురిచేసినట్లు జూనియర్ విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ర్యాగింగ్ విషయమై యూనివర్సిటీ వీసీ రమేష్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీలో అసలు ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేశారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను పిలిచి సీనియర్లు మాట్లాడారని చెప్పారు. జూనియర్లతో ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. అయితే, విద్యార్థినుల సస్పెన్షన్ నేపథ్యంలో యూనివర్సిటీలో అసలు ర్యాగింగ్ జరగలేదని వీసీ చెప్పడం చర్చనీయాంశమైంది.