కేంద్రాన్ని టార్గెట్ చేయడంలో ముందుంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha). ఈమధ్య ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇటు ప్రభుత్వ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabarwal) సైతం పలు అంశాలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. తాజాగా వీరిద్దరిపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao).
మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ ఘటన, సిద్దిపేటలో బాలికపై అత్యాచారం, పెద్దపల్లి జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచార ఘటనలకు సంబంధించిన న్యూస్ క్లిప్స్ ను పోస్ట్ చేసిన రఘునందన్.. రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై లైగింక వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. నిధులు రాక అప్పుల బాధతో, అవమానం భరించలేక మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం బాధాకరన్నారు.
మహిళా బిల్లు, మహిళలపైన కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవితకు ఇవి కనిపించవా అంటూ ప్రశ్నించారు రఘునందన్. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఎందుకు ఇంత వివక్ష అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై స్పందించే స్మితా సబర్వాల్.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య ప్రసాద్ గౌడ్.. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సకాలంలో ప్రభుత్వ నిధులు మంజూరు కాక, చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రూ.30 లక్షల నిధులతో గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులు చేస్తే ఇంతవరకు ఆ పనులకు సంబంధించి ఎంబీ రికార్డ్ చేయలేదని అంటున్నారు.