దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy)పై జరిగిన దాడిని ఉద్ధేశిస్తూ ఇటీవల సీఎం కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలకు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ కుటుంబం చేసిన అరాచకాలపై విరక్తి రావడంతోనే దుబ్బాక ప్రజలను తనను ఎన్నుకున్నారని రఘునందన్‌రావు వెల్లడించారు. తండ్రి, కొడుకు, అల్లుడు దుబ్బాకకు ఏం చేశారని వరుసపెట్టి వస్తున్నారని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చి దుబ్బాకుకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ఇస్తారా? అని సవాల్ విసిరారు.
కేసీఆర్ అంటేనే అబద్ధం, కేసీఆర్ అంటేనే మోసమని వ్యాఖ్యానించారు. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పాలంటేనే ఐదు సంవత్సరాలు పడుతుందని రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లకు తనపై ఎందుకు కోపమని, అభివృద్ధి నిధులు కావాలనుకోవడం తప్పా..? అని ప్రశ్నించారు.
2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన కేటిఆర్.. 1700 ఓట్లతో గెలిచని తనను వెక్కిరిస్తున్నాడని మండిపడ్డారు. ‘కత్తి పోట్లు మేము కూడా చేయవచ్చు..’ అని అనడం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెల్లిందని అన్నారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా.. నన్నూ పొడవండి.. అంటూ రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు.