– ప్రచారంలో దూకుడు పెంచిన హస్తం
– ఓవైపు బహిరంగ సభలు, రోడ్ షోలు
– ఇంకోవైపు సోషల్ మీడియాపై ఫోకస్
– రాష్ట్రానికి క్యూ కట్టిన అగ్ర నేతలు
– మరోసారి తెలంగాణకు రాహుల్, ప్రియాంక
– షెడ్యూల్ విడుదల చేసిన కాంగ్రెస్
ఎన్నికలకు పట్టుమని పది రోజులు కూడా లేవు. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. గ్రామ గ్రామానికి.. వీధి వీధికి.. ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థులు ఓట్ల వేటలో బిజీగా ఉన్నారు. వీరికి మరింత బూస్టప్ ఇచ్చేందుకు పార్టీల అగ్ర నేతలు జోరుగా పర్యటనలు పెట్టుకున్నారు. సీఎ కేసీఆర్ (CM KCR) లోకల్ కాబట్టి రోజుకు మూడు, నాలుగు బహిరంగ సభలతో బిజీగా ఉన్నారు. అయితే.. తెలంగాణ (Telangana) తో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జాతీయ పార్టీల అగ్ర నేతలు అక్కడ కూడా పర్యటిస్తూ ఇక్కడకు కూడా వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) అగ్ర నేతలు వరుసబెట్టి వస్తున్నారు.
ఇప్పటికే బస్సుయాత్రలు, బహిరంగ సభల కోసం అగ్ర నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తెలంగాణకు వచ్చారు. అధికారమే లక్ష్యంగా ఓవైపు క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతూ.. మరోవైపు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి వీరిద్దరి షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈనెల 24, 25 తేదీల్లో రాహుల్, ప్రియాంక రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. వీరు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ముందుగా 24న పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్ రూరల్ లో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. 25న మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం ఉండనుంది. ఈసారి ఎన్నికలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈ క్రమంలోనే పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు తాను పోటీ చేస్తున్న కామారెడ్డి, కొడంగల్ లో ప్రచారం చేస్తూనే ఇంకోవైపు పార్టీ అభ్యర్థుల కోసం బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రోజుకు రెండు మూడు సభలు ఉండేలా చూసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే ఏం చేస్తామో వివరిస్తూ ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు.