రైతుల నిరసనపై కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫైర్ అయ్యారు. పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై “గందరగోళం” చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌ను అవమానిస్తున్నారని అన్నారు.
కనీస మద్దతు ధర హామీ వల్ల వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయని తెలిపారు. గ్రామీణ భారత దేశంలో డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. దీంతో పాటు రైతులు వివిధ రకాల పంటలను పండించడంలో విశ్వాసాన్ని పొందుతారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మోడీ సర్కార్ చేసిన ప్రతిపాదన రైతుల ప్రయోజనాలను కాపాడేలా లేదని మండిపడ్డారు. దేశంలో రూ. 14 లక్షల కోట్ల విలువైన బ్యాంకు రుణాలు మాఫీ చేశారని వెల్లడించారు. రూ. 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ పన్నులను మినహాయింపు ఇచ్చారని చెప్పారు.
కానీ రైతుల కన్నీటిని తుడిచేందుకు చిన్న పాటి ఖర్చుకు కేంద్రం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. ఇక తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతుల పంటలకు ఎంఎస్పీ దక్కేలా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తుందని రాహుల్ గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారు.