Telugu News » Rahul Gandhi : కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం..!

Rahul Gandhi : కేసీఆర్ తిన్న అవినీతి సొమ్మును కక్కిస్తాం..!

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ విధానమన్న ఆయన.. ఆ పార్టీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్‌ జోడో యాత్ర సమయంలో చూశానని అన్నారు.

by admin
kcr

– కాళేశ్వరంలో అవినీతి వల్లే మేడిగడ్డ కూలింది
– కేసీఆర్ అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతాం
– బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకటే టీమ్‌
– ఎప్పుడూ కలిసే పని చేస్తాయి
– బీజేపీ బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతిచ్చింది
– ఎంఐఎం అభ్యర్థుల్ని బీజేపీ నియమిస్తుంది
– కాంగ్రెస్ బలంగా ఉన్న చోట దెబ్బతీయడమే వీరి లక్ష్యం
– నాంపల్లి సభలో రాహుల్ గాంధీ

కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi). నాంపల్లి (Nampally) నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు కుంగిందని ఆరోపించారు. పేదల నుంచి కేసీఆర్‌ దోచుకున్న ప్రతి రూపాయినీ వసూలు చేసి మళ్లీ జనానికి పంచుతామని తెలిపారు. బీజేపీ (BJP), బీఆర్‌ఎస్ (BRS), ఎంఐఎం (MIM) ఒకటే టీమ్‌ అని కలిసే పని చేస్తున్నాయని విమర్శించారు.

rahul-gandhi-addresses-the-public-in-nampally

అవినీతిపరుడైన కేసీఆర్‌ పై ఒక్క కేసు కూడా లేదన్న రాహుల్‌ గాంధీ.. మోడీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు ఆ పార్టీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మళ్లీ దొరల సర్కార్‌ వస్తుందన్నారు. అదే కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. ప్రజల సర్కార్‌ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2 శాతం ఓట్లు వచ్చే బీజేపీ బీసీ వ్యక్తిని సీఎం ఎలా చేస్తుందని ఈ సందర్భంగా సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. బీజేపీ బండి 4 టైర్లలో గాలి పోయి ఎప్పుడో మూలకు పడిపోయిందని విమర్శలు చేశారు.

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమే బీజేపీ విధానమన్న ఆయన.. ఆ పార్టీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్‌ జోడో యాత్ర సమయంలో చూశానని అన్నారు. బీజేపీని ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీలో ఎంపీల నివాసం నుంచి కూడా తనను వెళ్లగొట్టారన్నారు. దానికేం బాధపడలేదన్న రాహుల్.. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటికి వచ్చానని చెప్పారు. ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయింస్తుందని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించిన రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌ కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది తామేనని తెలిపారు. హైదరాబాద్‌ కు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చామని.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ను కాంగ్రెస్ హయాంలో రూ.400కే ఇస్తామన్నారు. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పారు.

You may also like

Leave a Comment