తెలంగాణలో 24 గంటల కరెంట్ కేవలం కేసీఆర్ ఇంట్లో మాత్రమే వస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేండ్లుగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆ దోపిడీకి అంతం పలికే రోజు వచ్చిందన్నారు.
పినపాకలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించ వచ్చని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం వస్తే రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెలా మహిళల అకౌంట్లలో రూ. 2,500 జమచేస్తామన్నారు.
కాళేశ్వరం పరిస్థితి ఎలా ఉందో తానే స్వయంగా వెళ్లి చూశానన్నారు. ప్రాజెక్టు పేరిట లక్ష కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అవినీతిని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్ అడుగుతున్నారని చెప్పారు. మీరు చదివిన స్కూల్, నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ వేసిందేనన్నారు. కేసీఆర్ ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేశారో ఆ మొత్తాన్ని ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ తుపాన్ మొదలైందన్నారు. ఆ విషయం సీఎం కేసీఆర్కు అర్థమైందన్నారు. కాంగ్రెస్ తుపాన్లో కేసీఆర్, బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక కుటుంబం కోసమే ఏర్పడలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒక్కటేనన్నారు. ఎక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటీ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం వస్తుందన్నారు.
బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్ ను ఐటీ క్యాపిటల్ గా కాంగ్రెస్ చేసిందన్నారు. ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే తమ పార్టీ అని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన కాదని స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వమన్నారు. ధరణి పేరుతో 20 లక్షల మంది రైతులను కేసీఆర్ మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. ధరణితో మోసపోయిన రైతులకు వాళ్ల భూములు వాళ్లకు ఇప్పిస్తామన్నారు. తెలంగాణలో కులగణనను జరిపిస్తామన్నారు. స్థానిక సంస్థల్లోనూ బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు.