కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) న్యాయస్థానంలో ఊరట లభించింది. 2018 పరువు నష్టం కేసులో రాహుల్‌కు సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ, కోర్టులో సరెండర్ అయ్యారు. అనంతరం 45 నిమిషాల కస్టడీ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది.
మరోవైపు కర్ణాటక ఎన్నికల సమయంలో బెంగళూరులో 2018 మే 8న జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్టు 4న పరువు నష్టం కేసు వేశాడు. మరో పక్క ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.
అయితే రాహుల్ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు. ఈ కామెంట్స్ పై బీజేపీ నేత విజయ్ మిశ్రా, సుల్తాన్ పూర్ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుల్తాన్ పూర్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ న్యాయవాది సంతోష్ పాండే విలేకరులతో మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రాహుల్ నేడు కోర్టుకు హాజరైనట్లు తెలిపారు.
ఆ తర్వాత కోర్టు ఒక్కొక్కరికి 25 వేల రూపాయల భద్రత, 25 వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిందని వెల్లడించారు. అయితే తదుపవరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదని, ఈ కేసులో రాహుల్ నిర్దోషి అని, పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. కాగా రాహుల్ చేపట్టిన భారత్‌జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతుంది. నేటి ఉదయం ఆయన కోర్టుకు హాజరు కావడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.