ఇది దొరల తెలంగాణ (Telangana) కు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న యుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని తెలిపారు. బీఆర్ఎస్కు ఓటు వేసినట్టేనని అని చెప్పారు. ములుగు జిల్లాలో నిర్వహించిన విజయ భేరి సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ఇస్తామని 2004 లో ప్రకటన చేశామన్నారు. చెప్పినట్టుగానే తెలంగాణను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ పార్టీ అయినా తమకు నష్టం కలిగించే పనులు చేయదన్నారు. కానీ తమ పార్టీ రాజకీయ లాభ నష్టాలను పక్కన బెట్టి రాష్ట్రాన్ని ఇచ్చామన్నారు.
దళితులకు మూడు ఎకరాల పేరుతో కేసీఆర్ మోసం చేశారని అన్నారు. కాళేశ్వరం పేరుతో మీ జేబుళ్లోంచి లక్ష కోట్లు సీఎం కేసీఆర్ తీసుకున్నాడని మండిపడ్డారు. ధరణి పేరుతో మీ భూమలు లాక్కున్నాడని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు.
కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేశామన్నారు. పోడు అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తామని అన్నారు. సమక్క సారక్క పండుగను జాతీయ పండుగగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో బీ ఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అని వెల్లడించారు.
బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అయి వున్నాయని ఆరోపించారు. వాళ్లతో పాటు ఎంఐఎం కూడా కలిసిందన్నారు. పార్లమెంట్ లో బీజేపీ ఏది కోరకుంటే బీఆర్ఎస్ అది చేసిందని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో సాగు చట్టాలకు, జీఎస్టీ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందన్నారు. ఆ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ పై సీబీఐ కానీ ఈడీ కానీ ఐటీ కేసులు గానీ లేవన్నారు. దేశంలో అన్ని విపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయన్నారు. తనను కేంద్రం ఎన్నో రకాలుగా వేధిస్తోందన్నారు. తనపై 14 కేసులు పెట్టారన్నారు. తన లోక్ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. తన అధికార నివాసాన్ని లాక్కున్నారన్నారు. కానీ కేసీఆర్ పై మాత్రం ఒక్క కేసు కూడా లేదన్నారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై బీజేపీ యుద్దం ప్రకటించిందన్నారు. తమ నేతలను కేసులతో వేధిస్తోందన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాల పార్టీ అని, బీజేపీతో కాంప్రమైజ్ కాదన్నారు. కేసీఆర్ మోడీ చేతుల్లో ఉన్నారని బీజేపీ నేతలకు తెలుసన్నారు. బీజేపీకి రాజకీయ అవసరాలు వున్నప్పుడు బీఆర్ఎస్ పై కాస్త ఒత్తిడి తీసుకు వస్తారన్నారు.
తాము బీజేపీతో కొట్లాడుతున్నామని చెప్పారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించామన్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీతో పాటు బీజేపీ బీ టీమ్ ను ఓడించాలన్నారు.